లాక్‌డౌన్‌తో నెలరోజులుగా గుహలోనే...

 


ప్రస్తుత కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంలో దేశం లాక్‌డౌన్‌ పకటించడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా విహార యాత్ర కోసం వచ్చిన విదేశీయుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. లాక్‌ డౌన్‌ వల్ల ఆరుగురు విదేశీయులు నెల రోజులుగా రిషికేశ్‌లోని ల‌క్ష్మ‌ణ్ జూలా ప్రాంతంలో గంగా ఒడ్డున ఉన్న ఒక గుహలోనే బతుకు వెల్లదీస్తున్నారు. 


 ఫారెన్ నుంచి వ‌చ్చిన ఈ ఆరుగురికి చేతిలో డ‌బ్బు అయిపోవ‌డంతో ఓ గుహ‌లో ఆశ్ర‌మం పొందుతున్నారు. ఆరుగురిలో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నార‌ని ఆ ఏరియా పోలీస్ ఆఫీస‌ర్ రాకేంద్ర సింగ్ క‌త్తైత్ తెలిపారు. వారిలో ఇద్ద‌రు ఉక్రెయిన్ నుంచి, ఒక‌రు ట‌ర్కీ, యుఎస్ఏ, ఫ్రాన్స్‌, నేపాల్ నుంచి వ‌చ్చారు.  


వీరు క‌ట్టెల‌ పొయ్యి పైనే ఆహారాన్ని వండుకుంటున్నారు. వారి స‌మీపంలో ప్ర‌వ‌హించే గంగా నుంచి నీటిని తీసుకుంటారు. వీరంతా మార్చి 24 నుంచి ఈ గుహ‌లో నివ‌శిస్తున్నారు. లాక్‌డౌన్‌కు మొద‌టి ద‌శకు ముందే గుహ‌లో ఆశ్ర‌యం పొందారు. వీరిని ఇప్పుడు అన్ని సౌక‌ర్యాలు ఉన్న‌ ఒక నిర్భంధ కేంద్రానికి మార్చారు. వైద్య ప‌రీక్ష‌ల్లో కొవిడ్‌-19 ల‌క్ష‌ణాలు ఏవీ వీరిలో కనిపించలేదు. ఉత్త‌రాఖండ్ పోలీసుల వివ‌రాల ప్ర‌కారం 600-700 మంది విదేశీయులు ఇప్ప‌టికీ రిషికేశ్‌లో చిక్కుకున్నారు. ఆయా రాయ‌బార కార్యాల‌యాలు చేసిన ఏర్పాట్ల ఆధారంగా త‌మ దేశాల‌కు బ‌య‌లుదేర‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.